ప్రస్తుత సైబర్ ప్రపంచంలో మోసం ఏ రూపంలో వస్తుందో ఎలా వస్తుందో తెలియదు. ఒక్కోసారి అన్నీ తెలుసూ అనుకున్నవాళ్లే బుట్టలో పడుతుంటారు. లక్షలకు లక్షలు మోసపోతుంటారు. అలాంటి మోసాల్లో ఒకటి ఇటీవలే వెలుగు చూసింది. ఒక రెస్టారెంట్‌కు బుకింగ్ కోసం కాల్ చేసిన ఒక మహిళను ఏకంగా రూ.85 వేలు యూపీఐ మోసం చేసిన ఘటన ఇది. అదెలా అయిందో తెలుసా!
ఎంత సులువో.. అంత డేంజర్
యూపీఐ ట్రాన్సాక్షన్లు ఎంత సులభంగా ఉంటాయో.. మనకు అవగాహన లేకపోతే అంతే ప్రమాదకరంగా మారతాయి. ముంబయికి చెందిన మన్‌ప్రీత్ మదన్ అనే ఆవిడ స్థానిక శివ్ సాగర్ రెస్టారెంట్లో ఒక టేబుల్ బుక్ చేయాలని అనుకుంది. అందుకోసం ఆ రెస్టారెంట్‌కు కాల్ చేసింది. ఆమె చేసిన తప్పల్లా.. గూగుల్‌లో ఆ రెస్టారెంట్ నంబర్ చూసి కాల్ చేయడం. మొదటిసారి ఆమె కాల్‌కు సమాధానం రాలేదు. ఆ తర్వాత ఆ నంబర్ నుంచే మళ్లీ ఆమెకు కాల్ వచ్చింది. తాను ఆ రెస్టారెంట్ మేనేజర్ని అని పరిచయం చేసుకున్న ఒక అపరిచితుడు... వెయిటింగ్ అవసరం లేకుండా ఉండాలంటే రూ.25 గూగుల్ పే ద్వారా పే చేయాలని సూచించాడు.
సెకన్లలో డబ్బులు మాయం
ఆమె రూ.25 చెల్లించగానే ఆమెకో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఒక లింక్ ఉంది. మీ పేమెంట్ కావాలంటే ఈ లింక్ ద్వారా పూర్తి చేయండి అని దాని సారాంశం. ఆ తర్వాత మరో నంబర్ ఆమెకు వచ్చింది. అది కూడా ఓ గూగుల్ పేజీ లింక్! మీ పిన్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి అని సందేశం వచ్చింది. ఆమె అలా చేయగానే రూ.25 బదులు రూ.85000 ఆమె అకౌంట్ నుంచి కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఆమె వెంటనే ఆ ఫోన్‌కు కాల్ చేసినా స్పందన లేదు. ఆ రెస్టారెంట్‌కు వెళ్లినా ఆ నంబర్ తమది కాదని వెల్లడించడంతో ఆమె షాక్ అయి పోలీసులను ఆశ్రయించింది. అపరిచితుల నుంచి ఇలాంటి గూగుల్ పే లింక్స్ వస్తే క్లిక్ చేసి పే చేయద్దని.. అఫీషియల్ లింక్ ద్వారానే వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు,.
UPI Fraud Woman Robbed Rs 85 000 Restaurant Booking